Thursday, April 14, 2016

ఉగాది = యుగాది

ఉగాది.. యుగానికి ఆది. అంటే సృష్టి ఆరంభమైన రోజు.. చైత్ర శుద్ధ పాడ్యమి రోజన వచ్చే ఉగాదిని దేశంలో తెలుగు వారితో సహా పలు ప్రాంతాల ప్రజలు సంవత్సరాదిగా జరుపుకుంటారు.

ఉగాది అంటే తలంటు స్నానం, దైవ పూజలు, పచ్చడి, పిండి వంటలు అని మాత్రమే నేటి తరం భావిస్తోంది.. ఈ పండుగ విశిష్టలను సంక్షిప్తంగా తెలుసుకుందాం...

ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి.. శడ్రుచుల సమ్మేళనం ఇది. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదుల కలయిక.. జీవితంలో మంచి చెడు, కష్ట సుఖాలను సమాన దృష్టితో స్వీకరించాలనే సందేశం ఈ పచ్చడి ఇచ్చే సందేశం..

పంచాగ శ్రవణం ఉగాది నాటి మరో విశిష్టత.. తెలుగు క్యాలెండర్ ప్రకారం తిథి, వార, నక్షత్ర, యోగ,కరణలు ఉంటాయి ఇందులో.. మనం ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం దైనందిన విధులను ఆచరిస్తున్నా, శుభ కార్యాలు, మంచి చెడుల విషయంలో తప్పని సరిగా తెలుగు కాలమానం పాటిస్తుంటాం.. ఉగాది నాడు పండితులు పంచాంగ శ్రవణంలో మన రాశి ఫలాలు, గ్రహ స్థితుల ఆధారంగా కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో చెబుతారు.

ఇక తెలుగు వారి విషయానికి వచ్చే సరికి ఉగాది నాడు కవి సమ్మేళనాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కవులు, రచయితలు తాము కొత్తగా చేసిన రచనలు, కవిత్వాలను వినిపిస్తారు.. మన భాషను, సాహిత్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో ఈ సమ్మేళనాలు దోహదం చేస్తున్నాయి..

No comments:

Post a Comment